ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సులేమాన్ రాజు హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భర్తను హత్య చేయించడానికి భార్య దుర్గామణి రూ.12 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఆమెతో పాటు ఆమె ప్రియుడు వెంకన్నబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
వడ్లమాను గ్రామానికి చెందిన సులేమాన్ రాజు గత నెల 17న హత్యకు గురయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, మృతుడి భార్య దుర్గామణి, ఆమె ప్రియుడు వెంకన్నబాబుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరూ కలిసి సులేమాన్ రాజును హత్య చేయడానికి పథకం పన్నినట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, దుర్గామణి వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం సులేమాన్ రాజుకు తెలియడంతో, తరచూ భార్యను ప్రశ్నిస్తూ వేధించేవాడని, దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని దుర్గామణి నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.
దుర్గామణి తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు రూ.12 లక్షలు సుపారీగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళికతో, సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజును గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని ఉప్పులూరు రైవస్ కాలువలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది.
కేసుపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. కాల్ డేటా, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికల ఆధారంగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి కారు, సెల్ఫోన్లు, నగదు, ఛార్జింగ్ కేబుల్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.











