ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్టలో ఒక పత్రికా విలేకరి నాలుకను ఒక మహిళ కొరికిన ఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఒంటిమిట్టలోని హరిత హోటల్లో చోటుచేసుకుంది.
కర్బూజ వ్యాపారిగా ఉన్న విలేకరి రవిబాబు, ఆటో డ్రైవర్ హరి కలిసి ఒక మహిళతో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ముగ్గురూ కలిసి ఒంటిమిట్టలోని హరిత హోటల్‌కు వెళ్లారు. హోటల్ సిబ్బంది మొదట అభ్యంతరం తెలిపినా, విలేకరి తన హోదాను ఉపయోగించి లోపలికి వెళ్లినట్లు సమాచారం.
హోటల్ గదిలో మద్యం సేవించిన తర్వాత జరిగిన పరిణామాల్లో, ఆ మహిళ విలేకరి రవిబాబు నాలుకను తీవ్రంగా కొరికింది. ఈ దాడిలో నాలుక నుంచి అధిక రక్తస్రావం కావడంతో, రవిబాబు వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా, వైద్యులు అతడిని 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈలోగా, ఆటో డ్రైవర్ సదరు మహిళను రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ మహిళ ఆచూకీ తెలియాల్సి ఉంది.
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్‌ను విచారిస్తున్నారు. తరచూ వివాదాలు తలెత్తుతున్న హరిత హోటల్ మేనేజర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












