తెలంగాణలోని ముఖ్య పట్టణాలలో లాడ్జీలు నేరస్తులకు అడ్డాగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో నిందితులు ధర్మపురిలోని ఒక లాడ్జీలో బస చేసి, నేరానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనతో లాడ్జీల నిర్వహణ, ఐడీ వెరిఫికేషన్, పోలీసుల నిఘాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మే 1న ధర్మపురి లాడ్జీలో బస చేసిన ఐదుగురు నిందితులు, మే 3న కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో దాదాపు 1 కిలోగ్రాము బంగారం దోచుకెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. నిందితులు తుపాకులతో కస్టమర్ల రూపంలో వచ్చి, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి, సెక్యూరిటీ గార్డును కట్టేసి పారిపోయినట్లు సమాచారం. పోలీసుల విచారణలో, నిందితులు ధర్మపురి లాడ్జీలో 'సౌరవ్ కుమార్' అనే పేరుతో నకిలీ ఆధార్ కార్డు చూపించి రెండు గదులు అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. వారు ఫోన్ నంబర్లు ఇవ్వకుండా, యూపీఐ చెల్లింపులు చేయకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ ఘటనతో లాడ్జీల నిర్వహణపై, ఐడీ వెరిఫికేషన్లో నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి లాడ్జీలో గెస్ట్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలి, అతిథుల పూర్తి వివరాలు, ఐడీ ప్రూఫ్, మొబైల్ నంబర్లు నమోదు చేయాలి. సీసీ కెమెరాలు కూడా తప్పనిసరి. అయితే, అనేక లాడ్జీలలో ఈ ప్రక్రియ నామమాత్రంగానే జరుగుతోందని, నేరస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దొంగ ఐడీలతో తప్పుడు సమాచారం ఇచ్చి రూమ్ లు తీసుకుని నేరాలకు పాల్పడి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.
పోలీసుల నిరంతర నిఘా, తనిఖీలు అవసరమని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ప్రత్యేక దాడులు జరిగినప్పటికీ, నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల అనుమతులు తీసుకుని నడిపిస్తుంటే, కొండగట్టు, ధర్మపురి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో అనుమతి లేని లాడ్జీలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్నాయని, వీటిపై కూడా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
లాడ్జీ నిర్వాహకులు సరైన ఐడీలు ధృవీకరించడం, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను వెంటనే పోలీసులకు అందించడం వంటి చర్యలు పాటించకపోతే, అవి నేరస్తులకు సురక్షిత స్థావరాలుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన కనీస భద్రతా ప్రమాణాల అమలుపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి పట్ల ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని రూములు అద్దెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది.











