నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఏసీబీ డిఎస్పీ జగదీష్ చంద్ర నేతృత్వంలోని బృందం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించి, సిబ్బంది నుంచి సెల్ ఫోన్లు, ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. కార్యాలయ గేట్లకు తాళాలు వేసి, రికార్డుల పరిశీలన ప్రారంభించింది. ఈ దాడులతో మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగింది.
ఇటీవల కాలంలో మున్సిపల్ కార్యాలయంలో పలు అవినీతి ఆరోపణలు, పనులు చేయకుండానే నిధుల డ్రా వంటి ఆరోపణలపై ఫిర్యాదులు అందాయని, ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం.
ఈ దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోదాల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ దాడుల వల్ల మున్సిపల్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.










