నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యం, మౌలిక వసతుల కొరత, తరుగు-తేమ పేరుతో జరుగుతున్న దోపిడీని నివారించి, యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు.
బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసేలా అర్జున్ మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకత్వాల ఆదేశాల మేరకు ఈ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కొనుగోళ్లు ఈ నెల 30 లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం, గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ మందగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తేమ పేరుతో దళారులు రైతులను దోపిడీ చేస్తున్నారని, ఈ దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కలెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే, రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











