మొక్కజొన్న దాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం, బైంసా మండలం మాటేగాం గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, నిర్వాహకులతో మాట్లాడుతూ ప్రతి రికార్డును స్పష్టంగా నిర్వహించాలని సూచించారు. రిజిస్టర్లను తనిఖీ చేసి, ధాన్యం రాక, తరలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
స్థానిక రైతులతో మాట్లాడి, కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమయానికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం తరలింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, షిఫ్టులవారీగా పనిచేస్తూ లోడింగ్ చేపట్టాలని హమాలీలకు సూచనలు ఇచ్చారు. అధిక ఉష్ణోగ్రతల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు. అనంతరం స్థానికంగా ఉన్న గోదామును కూడా పరిశీలించారు.
కోతుల్ గావ్ గ్రామంలోని గోదామును పరిశీలించి, నిల్వ సామర్థ్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న స్థలాలలో ధాన్యపు సంచులు నిల్వ చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మార్క్ ఫెడ్ డీఎం మహేష్, తహసిల్దార్ శశి భూషణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.











