జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 24
రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న రైతు బీమా పథకంపై సందిగ్ధం నెలకొంది. బీమా గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతులు, రైతు కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, ఇటీవల మరణించిన 12 మంది రైతుల కుటుంబాల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న రైతు బీమా పథకంపై సందిగ్ధం నెలకొంది. బీమా గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు, రైతు కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వారం రోజుల్లో జిల్లాలోని ఆయా గ్రామాల్లో 12 మంది మృతి చెందడం కలవరానికి గురి చేస్తోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందే వ్యవసాయ భూముల పట్టాలు కలిగిన రైతుల పేరిట ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు చెల్లించక పోవడంలో ఆంతర్యమేమిటనే చర్చ జరుగుతోంది. అయితే, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం దానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించలేదు. ఈ పథకాన్ని తీసుకువస్తున్నందున, రైతు బీమా పథకం ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
రైతు బీమాకు ప్రాధాన్యం
రైతు కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో 2019 ఆగస్టు 15న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించి, భారత బీమా సంస్థ (ఎల్ఐసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతు కుటుంబానికి అకస్మాత్తుగా రైతు మరణం తర్వాత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందడం వల్ల పంట నష్టాలు, అప్పులు, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు కొంత ఊరట లభించింది. ఈ పథకం కింద గతేడాది 96,850 మంది రైతులకు ప్రభుత్వం రైతుబీమా కల్పించింది. ఒక్కో రైతుకు 3,400 రూపాయల చొప్పున ప్రభుత్వం 32 కోట్ల 92 లక్షల 90 వేల రూపాయల ప్రీమియం చెల్లించింది. బీమా కాలంలో జిల్లాలో 421 మంది రైతులు మృతి చెందగా, ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 21 కోట్ల 5 లక్షల రూపాయల పరిహారం అందింది. ఈ గణాంకాలే రైతు కుటుంబాలకు ఈ పథకం ఎంతటి భరోసానిస్తుందో చెబుతున్నాయి.
12 కుటుంబాల పరిస్థితి ఏమిటి
బీమా గడువు ముగిసిన వెంటనే రైతుల మరణాలు చోటు చేసుకోవడంతో ఆయా కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. రైతు బీమా కొనసాగుతుందా కొత్త పాలసీకి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందా విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 5 లక్షల రూపాయల పరిహారం అందుతుందన్న నమ్మకంతో ఉన్న కుటుంబాలకు ఇప్పుడు స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది రైతు బీమా గడువు ఈ నెల 14తో ముగిసింది. సాధారణంగా కొత్త బీమా కాలానికి ముందుగానే ప్రీమియం చెల్లింపులు, రైతుల వివరాల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే, ఈసారి గడువు ముగిసే వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం రైతుల్లో సందేహాలకు తావిస్తోంది. అసలు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనే సంశయం రైతుల్లో నెలకొంది.












