మారిన వాతావరణ పరిస్థితులతో మామిడి పూత మొత్తం రాలిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చెన్నూర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో రైతు సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
మంచిర్యాల జిల్లా, చెన్నూర్ పట్టణానికి చెందిన మామిడి రైతు ఎల్లబోయిన మల్లేశ్ (47)కు రెండెకరాల మామిడి తోట ఉంది. ఈ ఏడాది తోటలో విస్తారంగా పూత రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించిన ఆయనకు, వాతావరణ మార్పులు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పూత పూర్తిగా రాలిపోవడంతో ఆయన తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు.
పూతను కాపాడేందుకు రసాయన ఎరువులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో మల్లేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శనివారం సాయంత్రం తోటకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన ఆయన రాత్రివేళ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. వారు తోటకు వెళ్లి చూడగా, మల్లేశ్ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించగా, అక్కడ పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లేశ్ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో మల్లేశ్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


