బైంసా పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా రైతు రావుల శివ సాయినాథ్కు చెందిన సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట నేలమట్టం కావడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రైతు రావుల శివ సాయినాథ్కు చెందిన 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా నీట మునిగి, భూమిలో కలిసిపోయింది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలి ఖర్చుల కోసం పెట్టుబడి పెట్టిన రైతులకు ఈ నష్టం తీరని లోటుగా మారింది.
స్థానికులు మాట్లాడుతూ, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని తెలిపారు. చివరి దశలో ఇలా పంట నష్టపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రాము డిమాండ్ చేశారు. రైతు బీమా, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా తక్షణ సాయం అందించి, రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.
స్థానిక రైతులు కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటూ, పంట నష్టం అంచనా వేయడానికి అధికారులు వెంటనే గ్రామాలకు వచ్చి పరిశీలించాలని కోరుతున్నారు.


