తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాంతంలో భారీ గాలులు, వడగళ్ల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీనితో స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ వడగళ్ల వాన కారణంగా మిర్చి, పత్తి, ఇతర వాణిజ్య పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు చెట్లు విరిగిపడ్డాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తాయి. వర్షపు నీటితో పలు రహదారులు జలమయమయ్యాయి.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. నష్టాలను అంచనా వేయడానికి సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపడుతున్నారు. రైతులకు నష్టం జరిగిన ప్రాంతాల్లో నివేదికలు సేకరిస్తున్నారు.


