జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, సేకరించిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గురువారం మామడ, లక్ష్మణచాంద మండలాల్లో పర్యటించి, ధాన్యం నిల్వకు అందుబాటులో ఉన్న గోదాములు, రైస్ మిల్లులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కలెక్టర్ భవేష్ మిశ్రా మామడ మండల కేంద్రంతో పాటు లక్ష్మణచాంద మండలంలోని తిరుపెల్లి గ్రామంలో ఉన్న రైస్ మిల్లుల ఆవరణలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి గోదాముల నిల్వ సామర్థ్యం, ధాన్యం భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మిల్లుల వద్ద సరిపడా టార్పాలిన్లు, ఇతర అవసరమైన వసతులు సిద్ధంగా ఉంచుకోవాలని మిల్లర్లకు సూచనలు జారీ చేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నిల్వ సామర్థ్యం విషయంలో ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.












