జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోన్ మండలం గంజాల్ టోల్‌ప్లాజా వద్ద లారీల సేకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
టోల్‌ప్లాజా మీదుగా వెళ్తున్న ఖాళీ లారీలను గుర్తించి, వాటిని ధాన్యం రవాణాకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. లారీ డ్రైవర్లు, యజమానులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరగకుండా వెంటనే వాహనాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
అనంతరం మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామ రహదారి వద్ద లారీల సేకరణ తీరును పరిశీలించిన కలెక్టర్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. లారీల సేకరణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించాలని తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బందికి టెంట్లు, కుర్చీలు, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
వాహనాలను ఆపిన వెంటనే సంబంధిత అధికారుల సమన్వయంతో అవసరమున్న కొనుగోలు కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యాన్నీ సహించబోమని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్లు సంతోష్, సరిత, శ్రీనివాస్, రెవెన్యూ, రవాణా, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.










