ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని కూకట్ పల్లి డీసీపీ రితి రాజ్ తెలిపారు.
గత మూడు రోజులుగా బండి భగీరత్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, సోమవారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు.
బండి భగీరత్ తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుడి కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతను ఎవరితో సంప్రదింపులు జరిపాడు, చివరిగా ఎక్కడ ఉన్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు.
బాధితురాలి స్టేట్మెంట్ను ఇప్పటికే ఒకసారి రికార్డ్ చేసినట్లు, అయితే కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉన్నందున మరోసారి ఆమె స్టేట్మెంట్ను నమోదు చేస్తామని డీసీపీ రితిరాజ్ పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.











