రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన పలు సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితర అధికారులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, దీనికి అవసరమైన హమాలీలు, గన్ని బ్యాగులు, లారీలు, తగిన నిల్వ స్థలాల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం తరలింపునకు అవసరమైతే లారీలతో పాటు ట్రాక్టర్లను కూడా వినియోగించుకోవాలని సూచించారు.
లారీ కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, లోడింగ్, అన్ లోడింగ్ ప్రక్రియకు స్థానిక హమాలీలను నియమించుకోవాలని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి రశీదులు అందజేయాలని, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, రైతులకు ఇబ్బందులు కలిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో మొక్కజొన్న, వరి పంటల కొనుగోలును సాఫీగా పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాల నుంచి అన్లోడింగ్ పాయింట్లు దగ్గరగా ఉంటే ట్రాక్టర్ల ద్వారా ధాన్యం సంచులు తరలించేలా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సంచులు ఎక్కువసేపు నిల్వ ఉంచరాదని, తూకం, తరలింపులో రైతుల నుంచి డబ్బులు వసూలు చేయరాదని హెచ్చరించారు.










