నిర్మల్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది.
ఈ ప్రత్యేక బృందం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అధిక రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయనుంది.
ముఖ్యంగా నిర్మల్ బస్టాండ్ పరిసరాలు, ఆటో స్టాండ్, అంబేద్కర్ చౌక్, మయూరి హోటల్ సమీపం, కిసాన్ షాపింగ్ మాల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఆక్రమణలు, రహదారులపై వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులతో చర్చించి, ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోనున్నారు. రహదారులపై అక్రమ పార్కింగ్‌ను నివారించి, వాహనాలను క్రమబద్ధంగా నిలిపేలా అవగాహన కల్పించనున్నారు.












