నిర్మల్, జూలై 2
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. జాతీయ రహదారిపై తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనిపై అధికారులు వెంటనే దృష్టి సారించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, వందలాది వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిపై తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణల కారణంగా తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది.
ముఖ్యంగా పి. నరసారెడ్డి విగ్రహం ఎదురుగా, ఒక వైపు బస్టాండ్ లోపలికి ఆర్టీసీ బస్సులు బయలుదేరుతుంటే, మరోవైపు బైల్ బజారు నుంచి మంచిర్యాల్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రధాన కూడలిలో రోడ్డుపై తోపుడు బండ్లు ఉండటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిరు వ్యాపారులు తమ జీవనోపాధి కోసం వ్యాపారాలు చేసుకోవడం హర్షణీయమే అయినప్పటికీ, ఏకంగా జాతీయ రహదారిపై రోడ్డు మధ్య భాగంలో తోపుడు బండ్లు నిలపడం వల్ల రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రహదారి విస్తీర్ణం తగ్గిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.
సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు దృష్టి సారించి, వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.












