నిర్మల్, జూలై 9
నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అదుపు చేసేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీసు బృందం ఏర్పాటు చేయబడింది. ఈ బృందం రేపటి నుంచి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు చేపట్టనుంది.
నిర్మల్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ బృందం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అధిక రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ నిరంతర పర్యవేక్షణ నిర్వహించనుంది. ముఖ్యంగా నిర్మల్ బస్టాండ్ పరిసరాలు, ఆటో స్టాండ్, అంబేద్కర్ చౌక్, మయూరి హోటల్ సమీపం, కిసాన్ షాపింగ్ మాల్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
అదేవిధంగా రహదారులపై వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారులతో చర్చించి ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడనున్నారు. అక్రమ పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో సీఐలు కృష్ణ, సమ్మయ్య, ఆర్ఐలు రామ్ నిరంజన్, రామకృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రేపటి నుంచి ఈ ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ కార్యక్రమం అమల్లోకి రానుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపివేయాలని, రహదారులను ఆక్రమించకుండా పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల విజ్ఞప్తి చేశారు.












