నిర్మల్, జూలై 10
నిర్మల్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సాఫీగా రాకపోకలు ఉండేలా జిల్లా ఎస్పీ డా జి జానకి షర్మిల ఐపీఎస్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో, ఎస్పీ పట్టణంలోని బస్టాండ్, మయూరి హోటల్ జంక్షన్, మంచిర్యాల చౌరస్తా, ఈద్గాహ్ చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
నిర్మల్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సాఫీగా రాకపోకలు ఉండేలా జిల్లా ఎస్పీ డా జి జానకి షర్మిల ఐపీఎస్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
ఈ రోజు జిల్లా ఎస్పీ పట్టణంలోని బస్టాండ్ పరిసరాలు, మయూరి హోటల్ జంక్షన్, మంచిర్యాల చౌరస్తా, ఈద్గాహ్ చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ పరిశీలన అనంతరం నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ బృందంలో టౌన్ ఇన్ స్పెక్టర్ సమ్మయ్య, రూరల్ ఇన్ స్పెక్టర్ కృష్ణ, ఆర్ ఐలు రామ్ నిరంజన్, రామకృష్ణతో పాటు ఎస్ ఐలు, ఆర్ ఎస్ ఐలు మరియు అదనపు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి వాహనాలను క్రమబద్ధీకరించనున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే ధ్యేయంగా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.












