.ప్రజలకు ఇబ్బందులు కలిగించే యూ-టర్న్‌లను వెంటనే తొలగించాలి : సామాజిక కార్యకర్త యండి. అంజద్
మిర్యాలగూడ జులై 10 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణం నుంచి వెళ్లే కోదాడ–జడ్చర్ల జాతీయ నాలుగు లేన్ల రహదారి నిర్మాణంలో భాగంగా ప్రధాన చౌరస్తాలను మూసివేసి డివైడర్లు నిర్మించడం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాజిక కార్యకర్త ఎండి. అంజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అంజాద్ విలేకరులతో మాట్లాడుతూ నాలుగు దారులు కలిసే ప్రధాన కూడళ్లను యథాతథంగా చౌరస్తాలుగాకొనసాగించకుండా, అవసరం లేని ప్రాంతాల్లో యూ-టర్న్‌లు ఏర్పాటు చేయడం ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోందన్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, స్కూల్ బస్సులు, అత్యవసర సేవల వాహనాలు అనవసరంగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందన్నారు. దాని ఫలితంగా సమయం, ఇంధనం వృథా కావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా అధికమవుతోందన్నారు. ముఖ్యంగా కాలినడకన వెళ్లే పాదచారులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, చిన్నారులు రోడ్లు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట సురక్షిత పాదచారుల క్రాసింగ్‌లు ఏర్పాటు చేయడం అత్యవసరం అని ప్రజల విజ్ఞప్తులు, నిరసనలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు చౌరస్తాలను పునరుద్ధరించే చర్యలు చేపట్టకుండా మౌనం వహించడం ఏమిటి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్న డివైడర్ల ఎత్తును మరింత పెంచడం స్థానికులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించే రహదారులు ప్రజలకు సౌకర్యాన్ని కల్పించేలా ఉండాలి తప్ప, ఇబ్బందులు సృష్టించేలా ఉండకూడదన్నారు. సంబంధిత జాతీయ రహదారి అధికారులు వెంటనే స్పందించి ప్రధాన కూడళ్లను తిరిగి చౌరస్తాలుగా ఏర్పాటు చేయాలని,ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అనవసర యూ-టర్న్‌లను తొలగించాలని, అవసరమైన చోట సురక్షిత పాదచారుల క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రజల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అంజద్ డిమాండ్ చేశారు.












