నిర్మల్, మంగళవారం
నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచే అంత్యోదయ అన్న యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం కోతలు విధించడాన్ని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ తీవ్రంగా ఖండించారు. పేదల అన్నం లాక్కునే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచే అంత్యోదయ పథకానికి కోతలు విధించడం సమంజసం కాదని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) పథకం కింద రేషన్ కార్డుదారులకు నెలకు 35 కేజీల బియ్యం అందజేస్తున్నారని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.
ఈ పథకం కింద వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, భూములు లేని పూర్తి పేదవారికి ప్రతి రేషన్ కార్డుకు, కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు అందించే 35 కేజీల బియ్యానికి బదులుగా, కార్డుదారులోని ఒక్కో సభ్యుడికి కేవలం 7 కేజీలు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించడం, పేదవాడి నోటికాడి అన్నం ముద్దను లాక్కోవడమేనని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, పాత పద్ధతిలోనే ప్రతి రేషన్ కార్డుకు 35 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












