ఇచ్చోడ, జూన్ 30
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు నెలకు రూ.20 వేల గౌరవ పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు డిమాండ్ చేశారు.
మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని అభినందన గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ ఆర్థిక, సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమకారులకు నెలకు రూ.20 వేల గౌరవ పెన్షన్ అందించాలని, మరణించిన ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు కూడా ఈ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. అలాగే అర్హులైన ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర మరువలేనిదని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని రాథోడ్ బాపురావు అన్నారు.
ఉద్యమకారుల హక్కుల సాధన కోసం జూలై 2న హైదరాబాద్ ఉప్పల్ భాగ్ఏత్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో రాష్ట్ర అబ్జర్వర్ తాండ్ర శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ధర్నా ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.












