హైదరాబాద్, జులై 02
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక శాఖ శుభవార్త అందించింది. జూలై 1వ తేదీనే వారి జీతాలను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపింది. గతంలో జీతాల ఆలస్యంపై ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగింది. జూలై 01వ తేదీనే వారి ఖాతాల్లో జీతాలు జమ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
గతంలో జీతాలు ఆలస్యంగా రావడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిర్ణీత తేదీన జీతాలు పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు.
ఆ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ప్రతి నెల 25వ తేదీలోగా సంబంధిత శాఖలు జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నెల చివరి పనిదినానికల్లా బిల్లుల పరిశీలన, ఆడిట్ ప్రక్రియ పూర్తి చేసి.. తదుపరి నెల మొదటి తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
ఈ నెల బిల్లులు సకాలంలో అందిన అన్ని శాఖల ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ప్రతి నెల ఎదురుచూడాల్సిన పరిస్థితి ఇక నుంచి ఉండదని.. కుటుంబ ఆర్థిక ప్రణాళికలు కూడా సులభతరం అవుతాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












