ఇందిరమ్మ ఇల్లు కోసం టవర్ ఎక్కిన కార్మికుడు... సిఐ, కాంగ్రెస్ నేత బాలు చోరువతో టవర్ దిగిన యూనస్
మిర్యాలగూడ జూలై 27 (మనోరంజని తెలుగు టైమ్స్) ఇందిరమ్మ ఇల్లు కోసం పెయింటింగ్ కార్మికుడు సోమవారం జియో టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. నేను ఆత్మహత్య చేసుకుంటానని, నేను చనిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులకైన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో జియో టవర్ ఎక్కి తన ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు అరగంటసేపు ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన పెయింటింగ్ కార్మికుడు యూనుస్ నేను, మా నాన్న 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండి పనిచేస్తున్నామని, ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే టూటౌన్ సీఐ సోమనర్సయ్య ఆధ్వర్యంలో ఎస్సైలు టవర్ ఎక్కిన యూనస్ తో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నచ్చజెప్పారు. అదేవిధంగా డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఫోన్లో వివరించగా టవర్ దిగాలని శాంతింప చేశారు. చిలుకూరి బాలు,సీఐ, ప్రత్యేక చొరవతో యూనస్ టవర్ దిగాడు. ఈ విషయమై మిర్యాలగూడ పట్టణంలో కొద్ది నిమిషాలలోఈ వార్త సంచలనం రేకిత్తించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎట్టకేలకు కిందికి దిగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.











