నిర్మల్, జూన్ 29
నిర్మల్ జిల్లా కేంద్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బూత్ స్థాయి ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యా గార్డెన్స్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బూత్ స్థాయి ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ శ్రేణుల సమస్యలను ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తల కోసం అవసరమైతే తన గళం వినిపిస్తానని మంత్రి పేర్కొన్నారు. కొందరు అధికారుల తీరుపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందని, ఈ విషయాలను పరిపాలన పరంగా క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
ఎవరూ నిరాశ, నిస్పృహలకు గురికావద్దని, సమిష్టిగా కష్టపడి పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు.
ఎస్ఐఆర్ పేరుతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చ జరుగుతోందని మంత్రి అన్నారు. ఓట్ల ప్రక్షాళన పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు చేసే ప్రయత్నాలు సరికాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు.
ఈ నెల రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అర్హులైన ఓట్లు తొలగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లోని సమస్యలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.












