రాజమహేంద్రవరం గ్రామీణం, 30 June
రాజమండ్రి సెంట్రల్ జైల్లో సినిమా షూటింగ్‌కు అనుమతుల అంశం వివాదాస్పదంగా మారిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. జైలు భద్రతా నిబంధనలు, అనుమతుల ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్‌కు అనుమతులు ఎలా ఇచ్చారో అధికారులు వివరించాలని ప్రశ్నించారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో సినిమా షూటింగ్‌కు అనుమతుల అంశం వివాదాస్పదంగా మారిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. జైలు భద్రతా నిబంధనలు, అనుమతుల ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జైల్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారులు, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెంట వచ్చిన భద్రతా సిబ్బందిని సైతం జైలు నిబంధనల పేరుతో అడ్డుకోవడం అవమానకరంగా ఉందని మేడా శ్రీనివాస్ ఆరోపించారు.
అదే సమయంలో తమిళనాడుకు చెందిన నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్‌కు సినిమా షూటింగ్ కోసం జైల్లో అనుమతులు ఎలా ఇచ్చారో అధికారులు వివరించాలని ఆయన ప్రశ్నించారు. హై సెక్యూరిటీ ప్రాంతమైన జైలు ప్రాంగణంలో షూటింగ్‌కు కేవలం జైలు అధికారుల అనుమతి సరిపోతుందా? ఇతర ప్రభుత్వ విభాగాల అనుమతులు అవసరమా? అనే అంశాలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.
గతంలో జైలు పరిసరాల్లో డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు సినిమా షూటింగ్ సమయంలో డ్రోన్ కెమెరాలు, ఆధునిక చిత్రీకరణ పరికరాలకు అనుమతులు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని అన్నారు.
షూటింగ్ కోసం భారీ సంఖ్యలో వాహనాలు, కెమెరా పరికరాలు, సాంకేతిక సిబ్బంది, జూనియర్ ఆర్టిస్టులు జైలు ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు పేర్కొంటూ భద్రతా తనిఖీలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
జైలు నిబంధనల అమలులో ఒకే విధమైన ప్రమాణాలు ఉండాలని, సినిమా షూటింగ్ అనుమతులపై ప్రభుత్వం విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.












