మంథని, జులై 23
మంథనిలో ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై పుట్ట మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పుట్ట మధు రాజకీయ జీవితం శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాద రావు చలవేనని, గతాన్ని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పుట్ట మధును మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, శశి భూషణ్ కాచే, సెగ్గం రాజేశం తీవ్రంగా ఖండించారు. గురువారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మంత్రి శ్రీధర్ బాబు నిరుపేదల కోసం నిత్యం పాటుపడుతున్నారని, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిందే దుద్దిళ్ల వంశమని అన్నారు. మంథని నియోజకవర్గ ప్రజల ఆదరణతోనే శ్రీధర్ బాబు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక మంత్రిగా వ్యవహరిస్తున్నారని, ప్రతి గ్రామంలో ప్రజలకు సేవ చేయడంతో పాటు వారి సమస్యల్లో అండగా నిలుస్తున్నారని తెలిపారు.
పుట్ట మధుకు రాజకీయ భిక్ష పెట్టింది శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాద రావు అని, ఆ విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పిదారి పోయి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన కర్మానికి, గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసు స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయమని బోర్డులు పెడతావా అని ప్రశ్నించారు. మంథనిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పుట్ట మధు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు.
అధికారుల వద్ద, కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తిన్న నీకు అభివృద్ధి ఎలా కనబడుతుందని, ఇప్పుడు కమిషన్లు రాకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావని ఆరోపించారు. పెట్టెం రామయ్య నడి రోడ్డుపై హత్యలు చేయమని చెప్పాడా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులను భయపెట్టే బుద్ధి మానుకోవాలని హితవు పలికారు.
మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












