Dr. B.R. Ambedkar Konaseema/Sakhinetipalli (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన చర్యలను, వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ బోధన్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో రాజన్న చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన చేపట్టారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని బీజేపీ నాయకులు మండిపడ్డారు.
ప్రధానమంత్రి నివాసం ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన చర్యలను, వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ బోధన్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో రాజన్న చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా భాజపా స్థానిక మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ మాట్లాడుతూ, ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనలు, ధర్నాలు అన్యాయమైనవని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. దేశంలో నెలకొన్న పలు సవాళ్లను ప్రధాని మోదీ ధీటుగా ఎదుర్కొంటుంటే, దానిని సహించలేక కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుతంత్రాలకు దిగుతోందని విమర్శించారు.
నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు అని, కానీ దేశ ప్రధాని ఇంటి వద్ద ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలు లేదా విధానాలపై విమర్శలు ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలుగా లోక్సభలో ప్రశ్నించి హక్కులను సాధించుకోవాలని, అంతేకానీ పత్రికలు, మీడియాలో ప్రచారం కోసం ఇటువంటి చిల్లర, పిల్లచేష్టలకు దిగడం సమంజసం కాదని హితవు పలికారు.
ప్రధాని నివాసాన్ని ముట్టడించడం లేదా అసాంఘిక శక్తులను, ఇతర పార్టీలను ప్రోత్సహిస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను బీజేపీ సహించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన, రైతులు, విద్యార్థులు, యువతకు చేసిన వాగ్దానాల అమలుపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
నీట్ (NEET) పరీక్షల ఫలితాల విషయంలో స్పష్టత వచ్చి, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ అనవసర గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఉన్న శ్రద్ధను కాంగ్రెస్ నాయకత్వం నిరూపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం, వైఖరిపై ప్రజలు ఇప్పటికే స్పష్టతతో ఉన్నారని, భవిష్యత్తులో ఇటువంటి నిరసన చర్యలు పునరావృతమైతే కాంగ్రెస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వమని భాజపా నాయకులు హెచ్చరించారు.
FCRA లాంటి విదేశాల నుండి వచ్చే నిధులకు బీజేపీ లెక్కలు అడుగుతోందని, అక్కసుతో అమెరికా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు భారత దేశ అభివృద్ధిని చూడలేక మన దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని, దానికి సీజెపి, కాంగ్రెస్, సమాజ్ వాది, టీఎంసీ లాంటి పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని, రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరం కావడం ఖాయమని బోధన్ మండల బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
ఇప్పటికైనా యువత తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని, లేదంటే దేశ భవిష్యత్ కష్టంగా మారుతుందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్, మండల ప్రధాన కార్యదర్శులు జంగం వెంకటేష్, దొనకంటి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు బండారు పల్లి సాయిలు, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, లచప్ప, బంటు గంగాధర్, నమిళ్ల సాయి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి జిలకర ప్రవీణ్, వివిధ గ్రామాల శక్తి కేంద్రం ఇంచార్జిలు, బూత్ అధ్యక్షులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








