ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు నిర్మల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ సభ జరగనుంది.
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షత వహించగా, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణలో మోదీ సభ చారిత్రాత్మకమవుతుందని నాయకులు పేర్కొన్నారు. సభ విజయవంతం కావడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువత, మహిళలు భారీగా సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని నాయకులు సూచించారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.











