తెలంగాణ రాజకీయాల్లో అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై జరుగుతున్న నిరాధారమైన అవినీతి ఆరోపణలకు కేసీఆర్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల టెండర్ విలువ రూ. 44 కోట్లు మాత్రమేనని, కానీ రూ. 30 కోట్ల అవినీతి జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆమె పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను 'తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్' (TSL) నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రమేయం లేదని ఆమె తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆరే ఈ దుష్ప్రచారానికి బాధ్యత వహించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులను 48 గంటల్లోగా తొలగించి, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు. లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.








