నిర్మల్ జిల్లా చరిత్రకు మరింత బలాన్ని చేకూర్చే కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మల్ పట్టణానికి సమీపంలోని గండి రామన్న క్షేత్రం వద్ద రాతి గుట్టల మధ్య ఉన్న సహజ గుహలో కాకతీయ కాలానికి చెందిన రెండు ఉమామహేశ్వర విగ్రహాలను గుర్తించారు.
ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విగ్రహాలు సుమారు క్రీ.శ. 10వ నుండి 11వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు. నల్లటి కఠిన శిల (బసాల్ట్)పై చెక్కబడిన ఈ విగ్రహాలలో ఒకటి, ఉమాదేవి లలితాసనంలో శివుని ఒడిలో కూర్చుని ఉండగా, శివుడు జటాజూటధారితో, శాంత స్వరూపంతో దర్శనమిస్తున్నాడు.
శివుని చేతుల్లో డమరుకం, త్రిశూలం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శిల్పకళలో శివ-పార్వతులకు ఆభరణాలు సున్నితంగా చెక్కబడి ఉండటం ఆ కాలపు శిల్పుల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. విగ్రహం అడుగుభాగంలో శివుని వాహనం నంది ప్రతిష్ఠితంగా ఉంది.
ఇదే గుహలో మరో ఉమామహేశ్వర విగ్రహం నంది వాహనంపై విరాజిల్లుతున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉన్న సహజ రాతి గుహలో ఈ విగ్రహాలు వేల సంవత్సరాలుగా నిలిచి ఉండటం విశేషం.
ఉమామహేశ్వర స్వరూపం దాంపత్య సౌఖ్యం, కుటుంబ శాంతి, ఐక్యతకు ప్రతీకగా భావించబడుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్ర పర్యటనలో డా. తుమ్మల దేవరావుతో పాటు అబ్బడి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












