హైదరాబాద్, జూలై 18
తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల ప్రతిపాదనలను ప్రభుత్వం మూడు నెలల్లోగా ఆమోదించి, అమలు చేయాలని విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల ప్రతిపాదనలను ప్రభుత్వం మూడు నెలల్లోగా ఆమోదించి అమలు చేయాలని విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమావేశంలో రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమ నేతలు మందాల భాస్కర్, ఎరవెల్లి జగన్ మాట్లాడుతూ.. కేకే కమిటీ విద్యార్థి ఉద్యమకారులతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం కోల్పోయిన విద్యార్థి ఉద్యమకారులు ప్రస్తుతం నిరుద్యోగులుగా మిగిలిపోయారని, వారికి గుర్తింపు ప్రక్రియలో తొలి ప్రాధాన్యత కల్పించాలని కమిటీని కోరారు.
అన్ని విశ్వవిద్యాలయాల సమన్వయ కమిటీగా త్వరలో కేకే కమిటీతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. అలాగే అన్ని విశ్వవిద్యాలయాల్లో విలేకరుల సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని, సెప్టెంబర్ 17న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వేదికగా బహిరంగ సభ, నవంబర్ 18న ఓయూ జేఏసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
డిసెంబర్ 9ను "తెలంగాణ విద్యార్థి విజయ దివస్"గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.












