ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు నెలలో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న 80వ ఆవిర్భావ వసంతోత్సవాల సన్నాహక ఏర్పాట్లపై రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్ మాట్లాడుతూ, సంఘం 80వ ఆవిర్భావ వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర శాఖ సూచనల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల ఐక్యతను చాటిచెప్పేలా, సంఘం సేవలను గుర్తు చేసేలా వసంతోత్సవాలను నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.
సమావేశంలో రాష్ట్ర, జిల్లా సంఘం నాయకులు పాల్గొన్నారు.











