ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే అందించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించడం కంటే, వారికి న్యాయపరంగా రావాల్సిన హక్కులు, ఆర్థిక ప్రయోజనాలను ముందుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయడంతో పాటు, జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని 51 శాతం ఫిట్మెంట్తో ప్రకటించాలని అన్నారు.
టీఎస్ఎల్ఐసీ రుణాలు, జీపీఎఫ్ బకాయిల బిల్లులను వెంటనే చెల్లించాలని, విద్యాశాఖలో సర్వీస్ రూల్స్ రూపొందించి మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని కోరారు. పర్యవేక్షణ అధికారులు లేకపోవడం వల్ల విద్యాశాఖ పనితీరు దెబ్బతింటోందని, నాణ్యమైన విద్య అందించేందుకు సమర్థమైన పర్యవేక్షణ అవసరమని తెలిపారు.
విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన యూనిఫారాలు, టైలు, బెల్టులు, షూలను వెంటనే సరఫరా చేయాలని కోరారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు సగం పెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని, వారికి పెన్షన్‌తో పాటు గ్రాట్యుటీ, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. ఇందుకోసం ప్రతి నెల ప్రత్యేక నిధులు కేటాయించి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని భూమన్న యాదవ్ కోరారు.











