రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రాబోయే రెండు, మూడు రోజుల్లో ఆర్థిక సహాయం జమ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించినట్లుగా, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియతో పాటు, గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు పూర్తవడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మంగళవారం నాటికి అధికారికంగా ముగిసింది.
ఈ నేపథ్యంలో, ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా సాయాన్ని ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఆశించిన ఫలితాలు సాధించడంతో, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లే ముందు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరింత సానుకూల వాతావరణం సృష్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గత వానాకాలం సీజన్లో 1,21,698 మంది రైతులకు రూ.88.86 కోట్ల సహాయం అందించింది. అంతకుముందు యాసంగి సీజన్లో 3 ఎకరాల లోపు భూములున్న 1,14,313 మంది రైతులకు రూ.42 కోట్లు జమ చేసింది. ఈ సీజన్లో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ద్వారా పంటలు సాగుచేసిన రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, సాంకేతిక కారణాలతో సర్వేలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో, వానాకాలం సీజన్లో లబ్ధి పొందిన రైతులకు ఈసారి కూడా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.


