తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త రంగుల్లో యూనిఫామ్‌లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఖరారు చేశారు. ఆగస్టు 15న మొదటి జత యూనిఫామ్‌ల పంపిణీ ప్రారంభం కానుంది.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేసే యూనిఫామ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిపిన సమావేశం అనంతరం విద్యార్థులకు కొత్త రంగుల్లో యూనిఫామ్‌లను ఖరారు చేసింది.
బాలుర, బాలికల షర్టులు లేత నీలం రంగులో, బాలుర ప్యాంట్లు, బాలికల బాటమ్స్ ముదురు నీలం రంగులో ఉంటాయి. గురుకుల పాఠశాల విద్యార్థులకు మెరూన్ చెక్స్ టాప్స్, ప్లెయిన్ మెరూన్ బాటమ్స్ ఖరారు చేశారు. 6వ తరగతి నుంచే బాలురకు నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫామ్‌లు అందిస్తారు. మొదటి జత దుస్తులను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యూనిఫామ్లతో పాటు బూట్లు, సాక్సులు, టై, బెల్టులను కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కార్పొరేట్ లుక్ తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.











