తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించేందుకు డయల్ 100 స్థానంలో ఇకపై 112 నంబర్‌ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ()లో నెక్స్ట్‌జెన్ డయల్-112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు పోలీస్ సహాయం కోసం డయల్ 100ను వినియోగించిన ప్రజలు ఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు సహా అన్ని అత్యవసర సేవల కోసం 112 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
ఒకే నంబర్, సమన్వయంతో సేవలు
ఒకే నంబర్ ద్వారా సంబంధిత శాఖలను సమన్వయం చేసి తక్షణమే సహాయం అందించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సిస్టమ్ ప్రత్యేకత ఏమిటంటే.. 112కు కాల్ చేసిన వెంటనే కాలర్ ఉన్న ఖచ్చితమైన ప్రదేశాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించి, సమీపంలోని పోలీస్, అగ్నిమాపక లేదా వైద్య అత్యవసర బృందాలకు సమాచారం చేరవేస్తుంది. దీంతో అత్యల్ప సమయంలో సహాయక చర్యలు ప్రారంభమై బాధితులకు సేవలు అందే అవకాశం ఉంటుంది.
24 గంటలూ అందుబాటులో సేవలు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సేవలు సంవత్సరంలో 365 రోజులు, రోజుకు 24 గంటలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఈ వ్యవస్థ మరింత భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.
ప్రజలకు పోలీసు శాఖ విజ్ఞప్తి
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు ఇకపై ఎలాంటి సందేహం లేకుండా 112 నంబర్‌కు కాల్ చేసి అవసరమైన సహాయాన్ని పొందాలని రాష్ట్ర పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ నూతన వ్యవస్థ అమలుతో అత్యవసర సేవల స్పందన సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.












