నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొంది. పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో ఇంధనం కోసం వాహనదారులు, రైతులు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
బైంసా పట్టణంలోని రిలయన్స్, హెచ్పీ, ఇండియన్, భారత్, నయారా వంటి పలు పెట్రోల్ బంకులలో ఇంధనం లభించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి వ్యవసాయ యంత్రాల యజమానులు ఇంధనం కోసం అల్లాడుతున్నారు. ఉదయం కొద్దిసేపు మాత్రమే పరిమితంగా ఇంధనం అందిస్తున్నారని వినియోగదారులు తెలిపారు.
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎక్కడా లేని విధంగా, కేవలం బైంసా పట్టణంలోనే ఈ కొరత ఏర్పడటం గమనార్హం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు మార్కెట్ అవసరాల నిమిత్తం పట్టణానికి వస్తుంటారు. ఈ కొరత వారి దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తోంది.
రాబోయే ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ పనులకు డీజిల్ అత్యవసరం. పొలాలను దున్నడానికి, ఇతర పనులకు డీజిల్ అవసరం. ప్రస్తుతం నెలకొన్న కొరతతో రైతులు తమ వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి చేసుకోలేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పటికీ, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ కొరతను వెంటనే నివారించాలని వాహనదారులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.











