పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తక్షణమే ధరలను పెంచే ఆలోచన లేదని, దేశంలో 45 రోజుల చమురు నిల్వలున్నాయని అధికారులు తెలిపారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, చమురు సరఫరాలపై ఆందోళనల నేపథ్యంలో, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తక్షణమే ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం దేశంలో 45 రోజులకు సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఎల్ఎన్ జీ, ఎల్ పీజీ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూసివేయబడటంతో, వేలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని అంచనాలున్నాయి. దీనివల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి, దేశీయ నిల్వలు అడుగంటితే ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆందోళనల నేపథ్యంలోనే వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్ లోనూ అనేక పెట్రోల్ బంకుల వద్ద వాహనాల క్యూలు దర్శనమిచ్చాయి. కొందరు వాహనదారులు బాటిళ్లలో కూడా పెట్రోల్ నింపుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే, ప్రభుత్వం నిల్వలు, ప్రత్యామ్నాయ మార్గాలపై భరోసా ఇచ్చింది.


