షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను కొనసాగించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం, హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును సమర్థిస్తూ ఈ తీర్పు వెలువడింది.
కేసు వివరాల్లోకి వెళితే, చింతడ ఆనంద్ అనే పాస్టర్, తాను క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ, తనపై జరిగిన దాడి విషయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రక్షణ కల్పించాలని కోరారు. అయితే, ఆయన బహిరంగంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని, ప్రార్థనలు నిర్వహిస్తున్నారని ఆధారాలతో నిరూపితమైంది.
దీంతో, ఆయనపై జరిగిన దాడికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారినప్పుడు, ఆ మతాల్లో కుల వివక్ష లేదని భావించడం వల్ల వారు ఎస్సీ హోదాను కోల్పోతారని ధర్మాసనం వివరించింది.
కేవలం ఎస్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్నంత మాత్రాన, ఆచరణలో వేరే మతాన్ని అనుసరిస్తుంటే ఆ హోదా చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా మత మార్పిడి చేసుకున్న దళితుల రిజర్వేషన్లు, ఇతర చట్టపరమైన రక్షణలపై చర్చకు దారితీసే అవకాశం ఉంది.












