దేశంలో పెరుగుతున్న ఉచిత పథకాల సంస్కృతిపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసే విధంగా ఉచితాల పంపిణీ చేయడం సమంజసం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
రాష్ట్రాలు ఉచిత పథకాలకు బదులుగా ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్నీ ఉచితంగా పంపిణీ చేసుకుంటూపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మిగలవని పేర్కొంది.
ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ వంటి వాటికి బదులుగా ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. తమిళనాడు ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీ ప్రకటించిన ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్- 2024లోని రూల్ 23ను సవాలు చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ సందర్భంగా, బిల్లు చెల్లించలేని పేదలకు సహాయం చేయడం అర్థవంతమైన చర్యే అయినప్పటికీ, ఆర్థిక స్థోమత ఉన్నవారికీ, లేనివారికీ తేడా లేకుండా ఉచితాలు ఇవ్వడం సరైందా అని సీజేఐ ప్రశ్నించారు.
రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయి కూడా నగదు పంపిణీ చేయడంపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను సాగునీరు, విద్యుత్ వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు ఎందుకు కేటాయించకూడదని అడిగారు. ప్రజలు గౌరవంగా జీవించడానికి ఉపాధి మార్గాలను సృష్టించాలని, ప్రతిదీ ఉచితంగా లభిస్తే ప్రజలు పని చేయడానికి ఎందుకు మొగ్గు చూపుతారని సీజేఐ ప్రశ్నించారు.


