మదురై కోర్టు తీర్పును ప్రజలు మానవత్వంతో స్వాగతిస్తున్నారని, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా హెడ్ కానిస్టేబుల్ రేవతి చూపిన ధైర్యం, నిజాయితీ ఆదర్శమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అన్నారు.
రాజమండ్రిలోని ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంత సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, మానవ హక్కులకు భద్రత లేకపోతే, న్యాయం అందుబాటులో లేకపోతే సమాజంలో ఉగ్రత పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. పౌరుల ఆత్మగౌరవం, స్వేచ్ఛకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఆయన సూచించారు.
తమిళనాడు సాత్తాన్‌కుళం కేసులో తండ్రి, కుమారుడి మరణానికి కారణమైన పోలీసులకు మదురై కోర్టు మరణశిక్ష విధించడం న్యాయంపై ప్రజల నమ్మకాన్ని పెంచిందని శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ, హెడ్ కానిస్టేబుల్ రేవతి నిబద్ధతతో నిజాలను వెల్లడించడంతో న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు, సిబ్బంది మధ్య వైఖరిలో వ్యత్యాసం ఉందని, కొంతమంది లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని శ్రీనివాస్ విమర్శించారు. చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తేనే పోలీస్ శాఖకు గౌరవం, ప్రజల విశ్వాసం లభిస్తాయని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోలీస్ వ్యవస్థపై ఆరోపణలున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయని శ్రీనివాస్ అన్నారు. లాకప్ మరణాలు, కుటుంబ హత్యల కేసుల్లో పారదర్శక విచారణ జరగాలని, ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తే సహకరిస్తామని తెలిపారు. పౌరుల భద్రత, స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి చట్టాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు.












