చిత్తూరు, 15 July
ఉద్యమనేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. బుధవారం సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఉద్యమనేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కుటుంబసభ్యులు ముద్రగడ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. బుధవారం సాయంత్రం ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముద్రగడ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మాజీ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్తతో కిర్లంపూడిలోని ఆయన ఇంటికి అభిమానులు భారీగా చేరుకున్నారు.
1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం, 1967లో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. ఆయన తండ్రి వీర రాఘవరావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1962, 1967లలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది శాసనసభ్యునిగా పనిచేశారు. 1977లో తండ్రి ఆకస్మిక మృతితో, సన్నిహితుడైన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సూచనతో 25వ ఏట జనతాపార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించిన ముద్రగడ, 1978లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆకస్మికంగా పదవికి రాజీనామా చేశారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీతో కలిసి కత్తిపూడిలో బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఆ పార్టీ తరఫున గెలిచి మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1994లో ప్రత్తిపాడు నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. 1999లో తెదేపాలో చేరి కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు.
2004లో మరోసారి ఎంపీగా పోటీచేసినా ఓటమిపాలయ్యారు. 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్న ముద్రగడ, 2024 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా, కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా ఉన్నారు.
కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో తుని వేదికగా జరిగిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న రైలు దహనం ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది.










