Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
లోకేశ్వరం మండలంలోని వాస్తాపూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని, వట్టోలి గ్రామంలో రూ.37 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు ప్రారంభించారు.
లోకేశ్వరం మండలంలోని వాస్తాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని అన్ని గ్రామాలకు నూతన ఈజీఎస్ (EGS) (VB G RAM G)పథకం కింద కమ్యూనిటీ హాళ్లు, కళ్యాణ మండపాలను మంజూరు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా చెరువుల మరమ్మతులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చేపట్టి సాగునీటి సౌకర్యాలను మెరుగుపరుస్తామని, మండలంలోని అన్ని ప్రధాన రహదారుల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం వట్టోలి గ్రామంలో రూ.37 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ నిర్వహించారు. విద్యాభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సీనియర్ నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.












