హైదరాబాద్, 29 July
నాగరికత, సాంకేతికత పెరిగినా మన మూలాలు మట్టిలోనే ఉన్నాయని, మట్టికి ప్రాణం పోస్తూ సమాజ ప్రగతికి, సంస్కృతికి నిలిచిన కుమ్మర వృత్తిని నేషనల్ క్లే డే వారోత్సవాల సందర్భంగా స్మరించుకుంటున్నారు. మట్టి పాత్రలు ఆరోగ్యానికి అమృతంతో సమానమని, అవి సంస్కృతికి, ప్రజారోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
నాగరికత ఎంతగా విస్తరించినా, సాంకేతికత పెరిగినా మన మూలాలు ఎప్పుడూ మట్టిలోనే ఉంటాయి. మట్టిని నమ్ముకుని, ఆ మట్టి ముద్దకు ప్రాణం పోస్తూ సమాజ ప్రగతికి, సంస్కృతికి ఆధారంగా నిలిచిన అపర సృష్టికర్తలు మన "కుమ్మర్లు". నేషనల్ క్లే డే వారోత్సవాల (జూలై 25-31) సందర్భంగా మట్టితో ముడిపడిన మన జీవితాన్ని, కుమ్మరి వృత్తి విశిష్టతను కొనియాడుతూ రాసిన కవితాత్మక వ్యాసం ఇది.
మట్టి నుండి పుట్టింది జీవం, మట్టితోనే ముడిపడింది జీవితం. కుమ్మరి చేతిలో ఆకృతి దాల్చే మట్టి పాత్రలు, కుండలు ఆరోగ్యానికి అమృతం లాంటివి. ఈ నేల తల్లి ఇచ్చిన వరం కుమ్మర వృత్తి. మట్టితో మాణిక్యాలు చేసి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం, పునరుత్తేజానికి నిరంతరం శ్రమించే కుమ్మర వృత్తి కార్మికుడి వృత్తి కౌశలానికి ప్రతీక కుమ్మరం. సారెపై తిరిగే చక్రం కాలచక్రం. కుమ్మరి శ్రమలోనే ఉంది సమాజ హితం.
మట్టి ముద్దను అమృత భాండంగా మార్చే కుమ్మరి చేతుల్లో ఉంది సృష్టి చమత్కారం. ఎండనక, వాననక మట్టిని పిసికి, పసిపాపల దానికి రూపం ఇచ్చి, కుండై ఊరి దాహం తీర్చే పుణ్యమూర్తి కుమ్మరి. కుమ్మరం సమాజ ప్రగతికి మూలమైన శ్రామిక కీర్తి, శ్రమ సంస్కృతికి ప్రతిబింబం. ఆధునిక నాగరికత ఎన్ని రంగులు మార్చినా, కుమ్మరి చేసిన మట్టి పాత్రల విలువ మారునా?
మట్టి పాత్రల్లో వంట ఒంటికి మంచిది. బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధులను నిరోధించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనిషి పుట్టుక, పెళ్లి, చావుకు మానవ జీవితంతో కుమ్మరి చేసిన కుండకు విడదీయరాని సంబంధం ఉంది. పండుగైనా, పబ్బమైనా ప్రమిదై వెలిగేది, సంస్కృతిని నిలబెట్టి జీవన జ్యోతిని వెలిగించేది కుమ్మరి చేసిన మట్టి పాత్రల్లోనే.
మట్టిని ప్రేమిద్దాం, కుమ్మర వృత్తిని గౌరవిద్దాం. నేషనల్ క్లే డే వారోత్సవాల సందర్భంగా కుమ్మర వృత్తిదారుల శ్రమను గౌరవిద్దాం. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడి, అందరికీ ఆరోగ్యాన్ని అందించే కుమ్మర వృత్తిని ప్రభుత్వం, పౌరసమాజం పునర్జీవింప చేయాలి. ప్రభుత్వం యూనివర్సిటీల్లో, వృత్తి విద్యా సంస్థల్లో పింగాణి, టెర్రకోట, పాటరీ కోర్సును పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి యువతకు ఉపాధి కల్పించాలి.
కుండలో నీరు చల్లదనాన్ని ఇస్తుంది. వాటిని తయారుచేసే కుమ్మరి శ్రమ మాత్రం సమాజానికి జీవనాన్ని ఇస్తుంది. మట్టి పాత్రలను వాడటం అంటే కేవలం ప్రకృతిని ప్రేమించడం కాదు, మన సంస్కృతిని, ప్రజారోగ్యాన్ని, సహజ వనరుల సంరక్షణ, మానవ వనరుల వికాసం, శ్రమ జీవన సౌందర్యాన్ని గౌరవించడం. నేషనల్ క్లే డే వారోత్సవాల సందర్భంగా ప్లాస్టిక్‌ను వీడుదాం, మట్టిని ఆదరిద్దాం.
శ్రమ నీ సృష్టి, మట్టి నీ అస్తిత్వం అని నిరూపించిన కుమ్మరి వృత్తిని ఆదరిద్దాం. మన దేశ సంస్కృతి, వారసత్వం, నాగరికతను జగతికి చాటుదాం. ప్లాస్టిక్‌ను వీడుదాం, మట్టిపాత్రలు ఆదరిద్దాం. చల్లని కుండ ఆరోగ్యానికి అండ. మట్టిని ప్రేమిద్దాం, జీవాన్ని గౌరవిద్దాం. ప్లాస్టిక్ హటావో, మట్టిపాత్రలు బచావో. మట్టిని రక్షిద్దాం, రేపటి తరాన్ని దీవిద్దాం.












