కొమురవెల్లి, 26 July
తెలంగాణలోని కొమురవెల్లి మల్లన్న భక్తుల చిరకాల స్వప్నం నెరవేరింది. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘనంగా ప్రారంభించారు. 5.63 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్, భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేయనుంది.
తెలంగాణ రాష్ట్రంలో కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త. భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని నూతన రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. కొమురవెల్లి మల్లన్న భక్తుల సౌకర్యార్థం 5.63 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.
కొమురవెల్లి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి వస్తున్న భక్తులు బస్సులు, వాహనాలలో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే స్టేషన్ ప్రారంభంతో ఆ ఇబ్బందులు తొలగిపోయినట్టేనని తెలిపారు. హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి రావడానికి ప్రజలు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు.
కొమురవెల్లి కొత్త రైల్వే స్టేషన్‌తో చేర్యాల, మద్దూరు, నర్మెట్ట మండలాల ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల విద్యార్థులకు, చిరు వ్యాపారులకు కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి వచ్చే వారికి రైలు ప్రయాణంతో సగానికి సగం ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు.
కొత్తగా ప్రారంభమైన కొమురవెల్లి స్టేషన్లో 400 మీటర్ల హై లెవెల్ ప్యాసింజర్ ప్లాట్‌ఫాం, విశ్రాంతి హాల్, టికెట్ కౌంటర్, తాగునీరు, విద్యుదీకరణ, స్థానిక సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్, అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్-సిద్దిపేట మార్గంలో నడిచే నాలుగు డెమూ రైళ్లకు కూడా ఈ స్టేషన్లో హాల్ట్ కల్పించారు. సిద్దిపేట నుంచి వచ్చే రైలు మధ్యాహ్నం 2:38 గంటలకు, ఉదయం 6:45 గంటలకు, సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లు మధ్యాహ్నం 12:44 గంటలకు, రాత్రి 8:04 గంటలకు అక్కడ ఆగుతాయి.












