హైదరాబాద్, జులై 08
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSRB) ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు కేవలం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ప్రాక్టికల్స్ పరీక్షలను, ఇకపై ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఒక అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ విధానంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే నిర్వహించే ఈ ప్రాక్టికల్స్ పరీక్షలను ఇకపై ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలోనూ నిర్వహించనున్నట్లు మండలి ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఒక అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది.
నూతన విధానం ప్రకారం, రెండు సంవత్సరాల్లోనూ బోర్డు నియమించే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు జరగనున్నాయి. సైన్స్ సబ్జెక్టుల థియరీ పరీక్షలు యథాతథంగా 60 మార్కులకే కొనసాగుతాయి. అయితే, ప్రాక్టికల్స్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించి, ప్రథమ సంవత్సరానికి 15 మార్కులు, ద్వితీయ సంవత్సరానికి 15 మార్కులు చొప్పున కేటాయించారు. ఇంటర్ మొదటి సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్ పరీక్షను 1 గంట 30 నిమిషాల వ్యవధిలో నిర్వహించనున్నారు.
వీటికి సంబంధించిన ప్రాక్టికల్ సిలబస్, మోడల్ క్వశ్చన్ పేపర్లు, నెలవారీ షెడ్యూల్‌తో కూడిన ల్యాబ్ మాన్యువల్స్‌ను బోర్డు ఇప్పటికే తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నూతన విద్యా విధానాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వార్షిక అకాడమిక్ ప్లాన్ ప్రకారం రెగ్యులర్‌గా ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని, పరీక్షల నాటికి విద్యార్థులు అన్ని ప్రయోగాలు పూర్తి చేసేలా చూడాలని బోర్డు పేర్కొంది. విద్యార్థులు తప్పనిసరిగా సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్‌ను పరీక్ష సమయంలో సమర్పించాల్సి ఉంటుందని, ల్యాబ్‌లలో భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఈ ప్రక్రియను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు పర్యవేక్షించనున్నారు.












