సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించారు. నెలల తరబడి కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.
సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ లో ఏర్పాటు చేసిన సన్ ఫ్లవర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులుగా నిరీక్షిస్తున్న రైతుల బాధలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తరుగు, నిబంధనల పేరుతో రైతులను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై ఒక్క రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదని, గత కేసీఆర్ ప్రభుత్వంలో వరి కోతలు మొదలవుతున్నాయంటేనే మంత్రులు, అధికారులతో మీటింగ్ పెట్టి, సంచులు, లారీలు, నిధులు అన్నీ సిద్ధం చేసి రైతులను కాపాడేవారని గుర్తుచేశారు.
ప్రస్తుతం ధాన్యం కేంద్రాల్లో నెలన్నర రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా ముఖ్యమంత్రికి గానీ, జిల్లా మంత్రులకు గానీ కనీస పట్టింపు లేదని విమర్శించారు. ఏ ఒక్క మంత్రి అయినా వడ్లు, మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ కొనుగోళ్లపై ఒక్కసారైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోని ప్రభుత్వం ప్రభుత్వమే కాదని, కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువులు, విత్తనాలు, కరెంటు, రైతుబంధు, సాగునీరు.. ఇలా అన్నింటికీ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
చిన్నకోడూరు ప్రాంతంలో ఎకరాకు 9-10 క్వింటాళ్ల సన్ ఫ్లవర్ పండుతుంటే, కేవలం ఆరున్నర క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధన పెట్టి, తీరా ఆ ఆరున్నర క్వింటాళ్లు కూడా కొనడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కోటా అయిపోయిందని చెబుతున్నారని, అయితే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పొద్దున లేస్తే పంటల మార్పిడి చేయమని, వరి తగ్గించమని చెప్పే ముఖ్యమంత్రి, రైతులు సన్ ఫ్లవర్, మక్కలు, శనగలు, జొన్నలు వేస్తే ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. జొన్న పంటను గతంలో ప్రతి ఏటా కొనేవారని, ఈ ప్రభుత్వం వచ్చాక జొన్నలు కొనడం లేదని, సన్ ఫ్లవర్ పూర్తిగా ఆపేశారని తెలిపారు. మక్కలకు 26 క్వింటాళ్ల సీలింగ్ పెట్టినా, ఆ మేరకైనా కొంటున్నారా అంటే అదీ లేదని, సంచులు కూడా ప్రభుత్వమే సరఫరా చేయలేకపోతోందని విమర్శించారు.












