మిర్యాలగూడ, జూన్ 30
మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్నం భోజనం తదితర అంశాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సందర్శించి, పరిశీలించి ఆరా తీశారు. మిర్యాలగూడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాకాల్ వాడి హైస్కూల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సూచన మేరకు ప్రభుత్వ పాఠశాలల సందర్శనలో భాగంగా రంగారెడ్డి మంగళవారం పాఠశాలను సందర్శించారు.
మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో పాటు కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టే వారి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వంట సరుకులు, గ్యాస్ ఇవ్వడం లేదని, తామే పంటకు అయ్యే ఖర్చులను భరించాల్సి వస్తుందని, బిల్లుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని కార్మికులు రంగారెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చాలని, దాని ద్వారా విద్యార్థులకు అన్ని మౌలిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. మధ్యాహ్నం భోజనం వంట చేసే వారికి బిల్లులను సమయానికి అందజేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా డబ్బు ఇవ్వాలని కోరారు.
పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సంఖ్య అందుకు అనుగుణంగా లేదని, ఉపాధ్యాయ నియామకాలు జరగాలని ఆయన అన్నారు. పాఠశాలలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, విద్యార్థులు మధ్యాహ్న సమయంలో పాఠశాల ఆవరణలో కాకుండా డైనింగ్ హాల్ నిర్మాణం చేయాలని కోరారు.
పాఠశాలను సందర్శించిన వారిలో సిపిఎం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, మల్లు గౌతమ్ రెడ్డి, బావుండ్ల పాండు, ఎండి సయ్యద్, తిరుపతి రామ్మూర్తి తదితరులున్నారు.











