నిర్మల్, జూన్ 29
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అనంతపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో (కేజీబీవీలలో) విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట గ్రామంలో గల కేజీబీవీను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి, ఆవరణను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.
పదవతరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారికి చెప్పిన సబ్జెక్టులను అడిగి, వాటిల్లో నుంచి పలు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులతో లెక్కలు చేయించి, సరిగ్గా చేసిన వారిని అభినందించారు. విద్యార్థులను నాలుగు జట్లుగా విభజించి, జంబుల్ వర్డ్స్ అరేంజ్మెంట్ ఆట ఆడించారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహం చూపాలని సూచించారు.
వసతి గృహంలో విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్య ఉందని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగానే, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ ప్రభాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










