హైదరాబాద్, జులై 07
భువనగిరి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు కోమ్మిడి నరసింహారెడ్డి హైదరాబాద్‌లో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తన కుమార్తె నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన రాజకీయ జీవితం, ఉద్యమ ప్రస్థానం గురించి వివరాలు ఇక్కడ చూడండి.
భువనగిరి మాజీ ఎమ్మెల్యే, కోమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన కుమార్తె నివాసంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపమైన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.
నరసింహారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సొంత ఇల్లు కూడా లేదు. ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపకుడు, గోదావరి జలాల సాధన ఉద్యమ నేత, మూసి పరిరక్షణ ఉద్యమకారుడు. మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి, 1943 సెప్టెంబర్ 10వ తేదీన బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు.
1962 నుంచి 1970 వరకు బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరాట సమితి భువనగిరి తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే 1962లో బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి కూడా కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు.












